ఒక వైపు కరోనా వైరస్ ఏపీలో విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గం ఎమ్మెల్యే అప్పలరాజు నిబంధనలను ఉల్లంఘించారు. పట్టుపురం చెక్ పోస్టు వద్ద తన అనుచరులతో హంగామా సృష్టించారు. 26 మందితో ఉన్న బస్సును ఏపీలోకి తీసుకొచ్చే విషయమై పోలీసులతో గొడవకి దిగారు.
వీరంతా మార్చి 17 ఓ వివాహ వేడుక కోసం ఒడిస్సాలోని భిలాయ్ వెళ్లారు. ఎమ్మెల్యే వారిని తీసుకువస్తుండగా చెక్ పోస్టు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. బారికేడ్లు తోసేసి వారందరిని తీసుకెళ్లారు.విషయం జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు పోలీసులు. దీంతో వారి ఆదేశాల మేరకు వజ్రపుకొత్తూరు దగ్గర వెంకటాపురంలో బస్సుతో పాటు పదికార్లలో వెళ్తున్న ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంటపాటు అనుచరులతో రోడ్డు పై బైఠాయించాడు ఎమ్మెల్యే అప్పలరాజు. మంత్రి కృష్ణదాస్ ,హోంమంత్రి సుచరిత చొరవతో వివాదం సర్దుమణిగింది.