ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారని, అన్ని నియోజకవర్గాల్లోనూ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని చెప్పారు.
సోమవారం బీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్రం ఎలాంటి సహాయం చేయకున్నా తాము రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని స్పష్టం చేశారు పల్లా. పంట నష్టం అంచనాలు పూర్తయ్యాక రైతులను తప్పకుండా ఆదుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి బృందాలను పంపించాలని కోరారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందన్నారు. పంట నష్టంపై గతంలో కేంద్రానికి ఎన్నిసార్లు అంచనాలు పంపినా నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలకు కేంద్రం ఏ రకంగానూ సహాయపడటం లేదన్నారు.
కేంద్రం తెచ్చిన ఫసల్ బీమా యోజనతో రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు. ఫసల్ బీమా యోజనతో రైతులకు నష్టం.. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేకూరుతుందన్నారు. ఈ పథకం స్థానంలో కేంద్రం కొత్త పాలసీని తేవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.