పల్నాడులో జరుగుతున్న క్రైం ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న వరుస దాడులు, హత్యలపై తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. దీంతో బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ ఇన్ ఛార్జ్ అరవింద్ బాబు సవాల్ విసరడంతో నరసరావు పేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అధికార పార్టీ అండదండలతోనే ఈ దాడులు, హత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో ఈ ఆరోపణలపై కోటప్పకొండ వేదిగా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుకున్నారు టీడీపీ, వైసీపీ నాయకులు. నరసరావు పేట ప్రాంతం రొంపిచర్ల మండలం అలవల లో జరిగిన దాడిపై బహిరంగ చర్చకు రావాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు కోటప్పకొండకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు టీడీపీ నేత అరవింద్ బాబు. మరో వైపు సవాళ్ల పై చర్చకు అనుమతులు లేవని అరవింద్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు.. నరసరావు పేటకు ఎవరూ రావద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఏది ఏమైనా అక్కడికి వచ్చే తీరుతామని చెప్పడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అయితే అలవలపాడు లో కోటి రెడ్డి పై జరిగిన దాడి వ్యవహారంలో చర్చకు సిద్ధమని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉంటే తీసుకురావాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 13న సవాల్ విసిరారు. దీనిపై రెండ్రోజుల క్రితం టీడీపీ ఇన్ ఛార్జ్ అరవింద్ బాబు స్పందించారు. ఉగాది రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని సాక్షిగా బహిరంగ చర్చకు వస్తానని దమ్ముంటే వైసీపీ అక్కడికి రావాలని సవాల్ విసిరారు. అయితే వైసీపీ నేతలు మాత్రం పండుగ రోజున ప్రజలను ఇబ్బంది పెట్టడం సరి కాదని.. మరో రోజు చూసుకుందామని చెబుతున్నారు. మరి ఈ సవాల్, ప్రతి సవాళ్ల వ్యవహారం ఎక్కడి వరకు పోతుందనేది ఆసక్తికరంగా మారింది.