– స్రవంతినే నియమించిన ఏఐసీసీ
– ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన
ఉత్కంఠ వీడింది. మునుగోడు బరిలో నిలిచే అభ్యర్థి పేరును ప్రకటించింది కాంగ్రెస్. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు పాల్వాయి స్రవంతికే సీటు కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి అధికారక ప్రకటన వచ్చింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అనేక చర్చల అనంతరం స్రవంతిని ఎంపిక చేసింది కాంగ్రెస్. ఈమె తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1967 నుంచి 1985 వరకు వరుసగా నాలుగుసార్లు గెలిచారు.
85 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి నారాయణరావు చేతిలో ఓడిపోయిన గోవర్ధన్ మళ్లీ 1999లో గెలిచారు. అయితే.. ఆ తర్వాత రెండు పర్యాయాలు సీపీఐ గెలిచింది. 2014లో టీఆర్ఎస్, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాయి. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు రాజగోపాల్ బీజేపీ గూటికి చేరడంతో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవంటూ కమ్యూనిస్టులు కేసీఆర్ పంచన చేరారు.
ఈ ఉప ఎన్నికలో కూడా కమ్యూనిస్టు పార్టీలు తమకే మద్దతుగా ఉంటాయని కాంగ్రెస్ భావించింది. కానీ, అనూహ్యంగా రెండు పార్టీలు హ్యాండిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది హస్తంపార్టీ. సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకునేందుకు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించింది. ఈ క్రమంలోనే అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఎంపిక చేసింది.