తెలంగాణలో సర్పంచులు, ఉప సర్పంచుల బాధలు అన్నీ ఇన్నీ కావు. అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు. కానీ, ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో రావడం లేదు. దీంతో చేసిన అప్పు ఎలా కట్టాలని మదనపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఉప సర్పంచ్ తనువు చాలించాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బాలినేని తిరుపతి పంచాయతీ బిల్లులు మంజూరు కాకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం వరంగల్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం తామిద్దరం కలిసి పని చేశామని అన్నారు సర్పంచ్ అంతర్గాం రాజమౌళి. దాదాపు రూ.11 లక్షల వ్యయంతో రైతు వేదిక నిర్మాణం, ఇతర పనులు చేశామని చెప్పారు. కానీ, చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తిరుపతి తనతో చెప్పి బాధ పడేవాడని వివరించారు. ఈ క్రమంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు సర్పంచ్.
గతంలో తిరుపతి భార్య కూడా ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు ఇద్దరు కూమార్తెలు అనాధలుగా మారారు. ఉప సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడడంతో చిదినేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పంచాయతీ నిధుల మళ్లింపు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంలో అసిఫాబాద్ జిల్లాకు చెందిన 18 మంది బీఆర్ఎస్ సర్పంచులు మూకుమ్మడిగా పదవులకు రాజీనామాలు చేశారు. నిర్మల్ జిల్లాకు చెందిన సర్పంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మూడు రోజుల్లోగా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 396 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.