కరోనా సంక్షోభం సమయంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. అయితే కరోనా మహమ్మారి సమయంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ పుట్టుకువచ్చినట్టు ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
ఇది ఇలా ఉంటే ప్రతి 33 గంటలకు ఒకరు తీవ్ర పేదరికంలోకి జారిపోయారని ఆక్స్ ఫామ్ పేర్కొంది. సిట్జర్ లాండ్ లోని దావోస్ లో ‘ ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది.
సంక్షోభ సమయంలో దశాబ్ధంలో ఎప్పుడూ లేనంతగా నిత్యావసర ధరలు పెరగడంతో ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు ఒక బిలియన్ డాలర్లు పెంచుకున్నారని వెల్లడించింది.
పాండెమిక్ సమయంలో ప్రతి 30 గంటలకు ఒకరు చొప్పున మొత్తం 573 మంది బిలియనీర్లుగా మారినట్టు తెలిపింది. మరోవైపు ప్రతి 33 గంటలకు ఒక్కరు చొప్పున ఈ ఏడాది మరో 263 మిలియన్ల మంది నిరుపేదలుగా మారనున్నట్టు వివరించింది.
గత 23 ఏండ్లతో పోలిస్తే కొవిడ్ సంక్షోభ సమయంలో కేవలం 24 నెలల్లోనే వారి సంపద భారీగా పెరిగినట్టు చెప్పింది. ప్రపంచంలోని బిలియనీర్ల మొత్తం సంపద ఇప్పుడు గ్లోబల్ జీడీపీలో 13.9 శాతానికి సమానమని పేర్కొంది. 2000లో 4.4 శాతం నుండి మూడు రెట్లు పెరిగినట్టు స్పష్టం చేసింది.