పన్నీర్ వర్గానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే అప్పగించి సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకం చెల్లుబాటు అవుతుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీం కోర్టు తీర్పుతో పన్నీర్ సెల్వం వర్గానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అమ్మ జయలలిత వారసత్వం తమకే చెందుతుందని పళనివర్గం వాదిస్తోంది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది.
మద్రాస్ హైకోర్టు తీర్పుపై పన్నీర్ సెల్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికి లాభం లేకుండా పోయింది. గత కొద్ది నెలల నుంచి అన్నాడీఎంకే పన్నీర్, పళనిస్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పుతో అన్నాడీఎంకే కంట్రోల్ మొత్తం పళనిస్వామి చేతిలోకి వెళ్లిపోయింది.
సుప్రీంకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవిలో పళనిస్వామి కొనసాగుతారు. జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నిక సరైనదే అని సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేసింది.ఎడప్పాడి పళినస్వామికి అనుకూలంగా తీర్పు వెలువడిన తర్వాత చెన్నై అవ్వై షణ్ముంగ రోడ్డులోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద వాలంటీర్లు సంబరాలు చేసుకున్నారు.