పంజాబ్ ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. ఎన్నికల వాయిదాను కోరుతూ పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి ఉంది. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్ప్రదేశ్ వారణాసికి వెళ్లే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగితే ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై ముందుగా పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ జనవరి 13న ఈసీకి లేఖ రాశారు. బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో దళిత వర్గానికి చెందినవారు దాదాపు 32శాతం ఉన్నారు. వారంత బెనారస్ కి వెళ్తే వారు ఓటింగ్ లో పాల్గొనే అవకాశం లేకుండా పోతుంది. విషయాన్ని చన్నీ ఈసీ రాసిన లేఖలో ప్రస్తావించారు. బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు కూడా ఈసీ ముందు ఇదే విషయాన్ని చెప్పాయి. గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి.
కాగా ఎన్నికల వాతావరణంతో పంజాబ్ వేడెక్కుతోంది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ పార్టీలు హీట్ పెంచుతున్నాయి. రాష్టంలో 32శాతం ఉన్న దళిత వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం పీఠం మీద కుర్చోబెట్టినా.. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని అధికారానికి దూరం చేసేలా కనిపిస్తున్నాయి. కొత్త రైతు చట్టాల విషయంలో అటు శిరోమణి అకాళీదల్, బీజేపీ రెండు భారీగా నష్టపోయాయి. ఈ ఎన్నికల్లో ఆప్ అధికారాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.