అదృష్టం ఎటునుంచి, ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. లక్ కలిసి వస్తే మట్టే బంగారమవుతుంది. ఈ మధ్య వజ్రాలు దొరికి రాత్రి రాత్రే లక్షధికారులుగా మారిపోతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీలోని నొయిడాకు చెందిన రాణా ప్రతాప్ అనే వ్యక్తికి మైన్ లో వజ్రం దొరికి లక్షాధికారిగా మారిపోయాడు. ఇప్పుడు మరో ఇద్దరి వ్యక్తులకు కూడా వజ్రలు దొరికి లక్షాధికారులయ్యారు. ఏదో సరదాగా చెరువు గట్టు వద్దకు వాకింగ్ కి వెళ్తే వారికి వజ్రాలు దొరికాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పన్నాలో జరిగే శరద్ పూర్ణిమ జాతరకు వృందావన్ రైక్వార్ అనే వ్యక్తి వచ్చాడు. జాతర అంతా తిరిగాక అతను కమలాబాయి చెరువు వద్ద సరదాగా తిరుగుతుండగా.. అక్కడ అతనికి మిలమిలా మెరుస్తూ ఏదో కనిపించింది. ఏంటని చూడగా అది ఓ అరుదైన వజ్రం. దాన్ని టెస్ట్ చేయగా 4.86 క్యారెట్ జెమ్స్ క్వాలిటీ గల వజ్రమని తేలింది. ఈ వజ్రం విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. దీన్ని అతను పన్నాలోని డైమండ్ ఆఫీస్ లో డిపాజిట్ చేశాడు.
పన్నా వజ్రాన్ని సొంతం చేసుకున్న మరో అదృష్టవంతుడు దస్సూ కోందర్కు చెందిన గాడా ఛతర్‌పుర్. ఇతను గత కొంత కాలంగా వజ్రాల వేటలో నిమగ్నమయ్యుండగా బుధవారం అతని పంట పండింది. ఓ అరుదైన వజ్రం అతని సొంతమయ్యింది. 3.40 క్యారెట్లు గల ఈ వజ్రం విలువ సుమారుగా రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. అతను ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్ లో డిపాజిట్ చేశాడు. ఈ రెండు వజ్రాలను త్వరలో జరిగే వేలంలో ఉంచనున్నట్లు డైమండ్ ఆఫీస్ అధికారులు తెలిపారు.
కాగా మధ్యప్రదేశ్ లోని పన్నా ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ధి. అనేక మంది ఆ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుని, ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు కూడా జరుపుతుంటారు. గనుల్లో దొరికిన వజ్రాల్ని డైమండ్ ఆఫీసుల్లో డిపాజిట్ చేసి, అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరికైనా తమ పొలాల్లో ఏదైనా విలువైన వజ్రం లేదా రాయి దొరికితే ప్రభుత్వం వాటి విలువలో 12.5 శాతం వాటా ఇస్తుంది. కానీ కొంత మంది తమకు గనుల్లో దొరికిందని, ఆ వస్తువు తమదే అని వాదిస్తారు. ఒక వేళ ఈ విషయంపై కోర్టుకు వెళ్తే తీర్పు గని యజమానికి అనుకూలంగా తీర్పు వస్తుంది.