బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు విషయాన్ని లాలూ కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వెల్లడించారు.
లాలూకు ఆయన కుమార్తె రోహిణి కిడ్నీని వైద్యులు సక్సెస్ ఫుల్ గా అమర్చినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన తండ్రితో పాటు సోదరి కూడా ఆరోగ్యం వున్నారని చెప్పారు. ప్రస్తుతం వారిద్దరూ ఐసీయూలో ఉన్నట్టు ఆయన ట్వీట్ చేశారు.
తన తండ్రి లాలూ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రిలో లాలూ ఉన్న వీడియోను ఆయన ట్వీట్ చేశారు. అంతకు ముందు లాలూ పెద్ద కుమార్తె ఎంపీ మిసా భారతి కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.
తన సోదరి రోహిణి కిడ్నీని వైద్యులు విజయవంతంగా తొలగించారని ఆమె అన్నారు. ఐసీయూలో రోహిణి ఆరోగ్యంగా ఉన్నారని, తన తండ్రికి వైద్యులు ఆపరేషన్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. ట్వీట్‌లో రోహిణి ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేశారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన సింగపూర్ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
లాలూని పరీక్షించిన సింగపూర్ వైద్యులు .. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని ఆయనకు సూచించారు. ఈ క్రమంలో లాలూకు కిడ్నీ దానం చేసేందుకు సింగపూర్‌లో ఉంటున్న ఆయన చిన్న కుమార్తె రోహిణి ముందుకొచ్చారు.