కన్న తల్లిదండ్రులే ఆ యువతి పాలిట కసాయిలుగా మారారు. పెళ్లి చేసి కట్నం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో 32 ఏళ్ల కన్నబిడ్డను బండరాళ్లతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. తోడబుట్టిన అన్న కూడా తల్లిదండ్రులకు సహకరించాడు. తీవ్ర గాయాలైన ఆ యువతి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెలగలగూడెం గ్రామానికి చెందిన తీర్పారి బుచ్చయ్య (65), లక్ష్మమ్మ (60) దంపతులకు గోవర్ధన్ (40), కవిత (32) అనే ఇద్దరు పిల్లలు. కవిత ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. తల్లిదండ్రులు కవిత పెళ్లి చేయమని కుమారుడు గోవర్ధన్ ను కోరుతున్నప్పటికీ అతను నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈ విషయంపై కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరిగడంతో కవిత గతంలో పోలీసుల నాశ్రయించింది. పోలీసులు వారి కటుంబసభ్యులను మందలించి పంపించినప్పటికీ వారిలో మార్పు రాలేదు. సంవత్సర కాలంగా తల్లిదండ్రులు, సోదరుడు కవితను వేధిస్తున్నట్టు తెలిసింది. చివరకు కవితను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్న తల్లిదండ్రులు, సోదరుడు శుక్రవారం తెల్లవారు జామున కవిత నిద్రిస్తుండగా ఆమెపై బండరాళ్లు వేసి హత్యాయత్నం చేశారు. కవిత అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి అంబులెన్స్ కోసం 108 కి సమాచారం ఇచ్చారు. కవితను నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితులు తీర్పారి లక్ష్మమ్మ, గోవర్ధన్ పరారీలో ఉండగా…బుచ్చయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.