వలసల జిల్లా పాలమూరులో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లీడుకొచ్చిన బిడ్డకు పెండ్లి చేసే స్థోమత లేక ఏకంగా అమ్మాయినే అమ్మకానికి పెట్టేశారు. కేవలం 3లక్షల రూపాయలకు కన్నపేగును వదిలించుకునేందుకు రెడీ అయిపోయారు. నవాబ్‌పేట మండలం హాజిలాపూర్ గ్రామ పరిధిలోని గాలోనికుంటకు చెందిన వాలమ్మ, రవినాయక్ దంపతులు. వీరికి నలుగురు సంతానం. హైదరాబాద్‌లో కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అక్కడే వీరికి షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయమైంది.
17 ఏళ్ల వయస్సున్న వారి రెండో కూతురు కు పెళ్లి చేయాలనే ఆందోళన ఆ దంపతుల్లో మొదలైంది. వీరి నిస్సహాయతను గుర్తించిన షాద్‌నగర్‌కు చెందిన సదరు వ్యక్తి ఆమెను అమ్మేందుకు స్కెచ్ వేశాడు. రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి చేద్దామంటూ ఆ దంపతులను ఒప్పించాడు. ఇందుకు సదరు పెళ్లికొడుకు ద్వారా 3 లక్షలు ఇప్పిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడికి అప్పగించేందుకు ఆ దంపతులు శుక్రవారం ఉదయం నవాబ్‌పేట నుంచి అమ్మాయిని తీసుకుని హైదరా బాద్‌కు బయల్దేరారు. అంతలోనే దుబాయ్‌లో ఉంటున్న ఆమె బాబాయ్‌కి విషయం తెలియడంతో నవాబ్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతులను అడ్డుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆమెను మహబూబ్‌నగర్‌లోని స్టేట్‌హోంకు తరలించారు.
ఈ మొత్తం వ్యవహారంలో మధ్య వర్తులు ఎవరు, వారికి ఇందులో ఎంత ఇస్తానన్నారు వంటి అంశాలపై విచారణ చేస్తున్నామని… కఠినంగా శిక్షపడేలా చూస్తామంటున్నారు పోలీసులు.