పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. పలు అంశాలపై చర్చలు జరపాలని విపక్షాలు పట్టుబిగిస్తున్నాయి. బీజేపీ మాత్రం అవేవి పట్టించుకోకుండా సభను ముందుకు సాగించేందుకు ప్రయత్నిస్తుంది. 12 మంది ఎంపీలపై ఉన్న సస్పెన్ష్ను తొలగించాలని విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డిమాండ్ చేశాయి. దీంతో రాజ్యసభ మరోసారి వాయిదా పడింది.
నేటికి 7 రోజుల నుంచి విపక్షాలు పలు అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. నాగాలాండ్ కాల్పుల ఘటనపై చర్చించాలని నిన్న విపక్షాలు డిమాండ్ చేయడంతో అమిత్ షా ఓ ప్రకటన చేశారు. అయితే, అమిత్ షా ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్ సభలో విపక్షాలు వాకౌట్ చేయగా.. షా ప్రకటన తరువాత రాజ్యసభ కూడా నేటికి వాయిదా పడింది.
అయితే, సమావేశాలు మొదలైన కాసేపటికే ఈరోజు కూడా రాజ్యసభ వాయిదా పడింది. అటు లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల మరణాలపై కేంద్రం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందంటూ విరుచుకుపడ్డారు. రైతుల మరణాలపై తమ దగ్గర డేటా లేదని ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు. 400మంది రైతులకు పంజాబ్ ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని.. 152 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చిందని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర డేటా లేకపోవడమేంటని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయలని.. ఉద్యోగాలివ్వాని డిమాండ్ చేశారు.
అటు, పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరససలు తెలిపారు. నల్ల చొక్కాలు వేసుకొని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి.. రైతులను కాపాడాలంటూ నినాదాలతో ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అయితే, టీఆర్ఎస్ ఎంపీల నిరసనలపై కేంద్రం స్పందించలేదు. దీంతో ఇరు సభలను టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.