పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే మొదటగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు స్పీకర్ ఓం బిర్లా నివాళులు అర్పించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.
లోక్ సభకు ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంపీలతో స్పీకర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో బాలీవుడ్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, యూపీ బీజేపీ ఎంపీ దినేశ్ లాల్ యాదవ్, ఘన్ శ్యామ్ సింగ్ లోధీలు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నందున సమావేశాలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
కంటోన్మెంట్ బిల్లు, మల్లీ స్టేట్ కోపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు, కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్ బిల్లు సహా మొత్తం 24 బిల్లులను కేంద్రం లిస్ట్ చేసింది. మొదటి రోజు ఫ్యామిలీ కోర్టుల సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సభలో ప్రవేశపెట్టారు.
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లోక్ సభ సమావేశాలు పున: ప్రారంభం అయ్యాయి. ధరల పెంపు, అగ్నిపథ్ స్కీమ్ పై ప్రతిపక్షాలు రచ్చచేశాయి. ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించడంతో సభను ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ లోక్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
Advertisements
మరోవైపు రాజ్యసభలోనూ జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. సభలో చర్చ జరుగుతుండగా అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ ధరల పెంపు, ఇతర అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చారు. విపక్షాల నిరసనల నడుమ సభను మంగళవారానికి వాయిదా వేశారు.