పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత సందర్భంగా వరుసగా నాలుగోరోజూ గురువారం ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడ్డాయి. లండన్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన సభకు క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తుండగా .. ఆయన అపాలజీ చెప్పవలసిన అవసరం లేదని, మొదట అదానీ అంశంపై జేపీసీని నియమించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు కోరుతున్నారు.
గురువారం ఉదయం ఉభయ సభలూ సమావేశమైన కొద్దిసేపటికే రభస కారణంగా మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ .. అదానీ వివాదంపై జేపీసీని వేయాలని మేం ఎప్పుడు డిమాండ్ చేసినా ఈ సమస్యపై ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ సభ్యులు యత్నిస్తూ సభా కార్యకలాపాలు కొనసాగకుండా రభస సృష్టిస్తున్నారని ఆరోపించారు.
పార్లమెంట్ లో ఎవరో ఒకరు అదానీ అంశాన్ని లేవనెత్తుతారని వారు భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఈ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటివరకు వివిధ బిల్లులకు సంబంధించి ఎలాంటి చర్చలు, ఇతర లావాదేవీలు జరగకపోవడంపై ప్రధాని మోడీ.. తన మంత్రివర్గం లోని కొందరు మంత్రులతో సమావేశం నిర్వహించారు.
మంత్రులు రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయెల్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషీ ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లండన్ లో తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇస్తారని సమాచారం.