అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదికపై పార్లమెంట్ లో ఈ రోజు రచ్చ జరిగింది. ఈ వ్యవహారంపై భారత ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి.
ఈ క్రమంలో సభలు ఆర్డర్‌లో లేవని సభాధిపతులు ఉభయ సభలను వాయిదా వేశారు. లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ తెలిపారు.
అంతకు ముందు విపక్ష పార్టీల ఎంపీల అత్యవసర సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఈ క్రమంలో 16 విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ రోజు ఉదయం సమావేశానికి హాజరయ్యారు.
కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాది పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ, జనతాదళ్ యునైటెన్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లకు చెందిన నాయకులు మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్ లో సమావేశమయ్యారు.