పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత లోనూ ఉభయ సభలూ పాలక, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోమవారం వేడెక్కాయి. ఉదయం జరిగిన రభసతో మధ్యాహ్నం 2 గంటలవరకు లోక్ సభ, రాజ్య సభ వాయిదా పడగా.. తిరిగి సమావేశమైనప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. లండన్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో డిమాండ్ చేశారు. అయితే అదానీ, హిండెన్ బెర్గ్ నివేదిక అంశంపై జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమించాలంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు పట్టు బట్టాయి.
ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని, తాము కోరిన డిమాండును ప్రభుత్వం తిరస్కరిస్తోందని ప్రతిపక్ష ఎంపీలు ధ్వజమెత్తారు. సభా కార్యకలాపాలను కావాలనే అడ్డుకుంటున్నారని బీజేపీ సభ్యులు ..వారిపై ఎదురుదాడికి దిగారు. ఈ గందరగోళంతో ఉభయ సభలూ రేపటికి వాయిదా పడ్డాయి.
ఆ తరువాత ఆప్, బీఆర్ఎస్ నేతలతో కలిసి సంయుక్తంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్.. మల్లిఖార్జున్ ఖర్గే..ఈ మోడీ ప్రభుత్వ హయాంలో రూల్ ఆఫ్ లా అన్నది గానీ, ప్రజాస్వామ్యంగానీ లేదని, అదానీ అంశంపై జేపీసీని వేయాలని తాము డిమాండ్ చేస్తుంటే పార్లమెంటులో మా మైక్ లను స్విఛాఫ్ చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ సభ్యులే రభసకు కారణమవుతున్నారన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఈడీ, సిబిఐ వంటి అన్ని అంశాలనూ ఉభయ సభల్లో లేవనెత్తాలనే నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. ఇక రాహుల్ గాంధీ లండన్ లో అనుచితంగా ఏదీ మాట్లాడలేదని, ఆయన క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదని పార్టీ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు.