పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మరోసారి అదానీ వ్యవహారంపై రచ్చ జరిగింది. రెండో రోజు కూడా అదానీ వ్యవహారంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై చర్చించాల్సిదేనని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభలో గందర గోళం ఏర్పడింది.
మరోవైపు లండన్ లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమపణలు చెప్పాలని ఎన్డీఏ ఎంపీలు డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్షాల సభ్యుల ఆందోళన నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించేందుకు ఇరు పక్షాల ఎంపీలు సహకరించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు.
కానీ ఇరుపక్షాల ఎంపీలు ఆయన సూచనను వినిపించుకోలేదు. సభలో ప్లకార్డులు ప్రదర్శించొద్దని, నిల్చున్న సభ్యులంతా కూర్చోవాలని కాంగ్రెస్ సభ్యులకు స్పీకర్ సూచించారు. కానీ కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళనలు కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభలో కొద్ది సేపు కార్యకలాపాలు జరిగాయి. భారత్కు ఆస్కార్ అవార్డు తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర బృందాలకు రాజ్య సభ ఎంపీలు అభినందనలు తెలియజేశారు. భారత్ కు ఆస్కార్ అవార్డులు రావడం దేశంలోని ప్రతిభకు అంతర్జాతీయంగా దక్కిన గొప్ప ప్రశంస అని చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. అనంతరం అదానీ వ్యవహారంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం మొదలవడంతో సభను వాయిదా వేశారు.