పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం అవ్వడానికంటే ముందుగానే మరో కీలక నిర్ణయం వెలువడింది. పార్లమెంట్ ఆవరణలో ఇక మీదట ధర్నాకు అనుమతి ఉండదంటూ తాజా ఉత్తర్వులు పేర్కొన్నాయి. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ వీటిని జారీ చేశారు. ఇందుకోసం సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు.
‘ధర్నా, ప్రదర్శన, నిరాహార దీక్ష, సమ్మె, ఏదైనా మతపరమైన వేడుక కోసం సభ్యులు పార్లమెంట్ ఆవరణను వినియోగించకోలేరు. ఇందుకు సభ్యులు సహకరించాలని కోరుతున్నాను’ అంటూ ఆ లేఖలో పీసీమోడీ పేర్కొన్నారు.
తాజా ఆదేశాలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శలు చేశారు. ‘విశ్వగురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక ధర్నాపై నిషేధం’ అంటూ విరుచుకుపడ్డారు.జులై 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో .. ఇప్పటికే లోక్‌సభ నిషేధిత పదాల జాబితాను విడుదల చేసింది.
వాటిలో అవినీతిపరుడు, సిగ్గుచేటు, డ్రామా, జుమ్లాజీవి, పిరికివాడు, చీకటి రోజులు, అహంకారి వంటి పలు పదాలను వాడకూడదని పేర్కొంది. అయితే పదాల జాబితాపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత సాధారణంగా ఉపయోగించే పదాలను కూడా మాట్లాడొద్దని చెప్పడం సరికాదంటూ మండిపడ్డారు.
సమయానుకూలంగా కొన్ని పదాలు, హావభావాలను పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రాల చట్టసభల్లో వినియోగించకుండా వాటిని అమర్యాదకరమైనవిగా ప్రకటిస్తుంటారు. రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.