పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 12 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సమావేశాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సెషన్‌లో లోక్ సభ 18 రోజుల పాటు పనిచేస్తుందని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. సమావేశాలు మొత్తం 108 గంటల పాటు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇక జీరో అవర్ నోటీసుల విషయంలో సమయాన్ని మార్చిన విషయాన్ని సభ్యులకు గుర్తు చేశారు.
ఈ సమావేశాల్లో 24 బిల్లులను ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్ రెడీ అవుతోంది. ఇందులో కంటోన్మెంట్ బిల్లు, మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బిల్లు, గిడ్డంగుల అభివృద్ది, నియంత్రణ బిల్లు తో పాటు ఇతర బిల్లులు ఉన్నాయి. ఇక మరో ఎనిమిది బిల్లులు ఉభయ సభల ముందు పెండింగ్ ఉన్నాయి.
ఇటు రాష్ట్రపతి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సెషన్ లోనే ఉపరాష్ట్రపతి ఎన్నికను కూడా నిర్వహించనున్నారు. సభలో పాటించాల్సిన విధానాలు, మాట్లాడే మాటలకు, నిరసనలకు సంబంధించి పలు నిషేదాజ్జలను లోక్ సభ సెక్రటేరియట్ విధించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ పార్లమెంటరీ పదాల జాబితా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది.