ప్రజాతీర్పును ఏ వ్యవస్థ కూడా కాలరాయజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ అన్నారు. అలాంటి అధికారాలు ఏ వ్యవస్థకూ లేవన్నారు. ప్రజాస్వామ్య మనుగడను ఏ వ్యవస్ధ నీరు గార్చజాలదన్నారు. నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లును సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జైపూర్ లో బుధవారం 83 వ స్పీకర్ల సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన.. ప్రజలు ఇచ్చే సార్వభౌమాధికార తీర్పుమీద దేనికీ అధికారాలు లేవని స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్డ అధికారాల పట్ల తమ అసంతృప్తిని తెలియజేయాలని సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ ని కోరడం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. అంటే భారత రాజ్యాంగాన్నీ కోర్టు ప్రశ్నిస్తోందా అని ఆయన అన్నారు . కొలీజియం సిస్టం ద్వారా జడ్జీలను నియమించే హక్కు తమకు ఉందని సుప్రీంకోర్టు డిసెంబరు 8 న తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
పార్లమెంట్ చేసిన చట్టం కోర్టు ఆమోదం పొందితేనే చట్టమవుతుందా అని ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు పార్లమెంట్ చట్టాలు చేయడం ఎందుకన్నారు. న్యాయవ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని చెబుతూనే ఆయన.. రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను పార్లమెంట్ సవరించజాలదన్న సుప్రీంకోర్టు అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారు, ప్రతిభావంతులు శాసన సభలు, పార్లమెంటులో సభ్యులుగా ఉంటున్నారని జగదీప్ ధన్ కర్ చెప్పారు. లెజిస్లేచర్లకే అధికారాలు ఉంటాయి.. నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సభ్యులంతా దీనికి అనుకూలంగా ఓటు చేశారు. అని ఆయన పేర్కొన్నారు.
అయితే 99 వ రాజ్యాంగ సవరణ చట్టం , నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ చట్టం (2014) రాజ్యాంగ విరుద్ధమని 2015 అక్టోబరు 16 న సుప్రీంకోర్టు 4-1 మెజారిటీతో తీర్పునిచ్చిందని ఆయన అన్నారు. కొలీజియం వ్యవస్థ పట్ల మొదటి నుంచీ తన వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తున్న ధన్ కర్.. రాజ్యాంగాన్ని సవరించేందుకు, చట్టాలు చేసేందుకు పార్లమెంటుకు గల అధికారాలు మరే అథారిటీకి లేవని స్ఫష్టం చేశారు. పరోక్షంగా సుప్రీంకోర్టునుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.