కోవిడ్ మహమ్మారి పార్లమెంటులో కలకలం రేపుతోంది. పార్లమెంటులో కరోనా బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
పార్లమెంట్ సిబ్బంది 850 కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పార్లమెంటు అధికారులు అలర్ట్ అయ్యారు. సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఎలాంటి లక్షణాలు లేని వారే విధులకు హాజరుకావాలని తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నా విధులకు రావొద్దని సూచించారు. అటు జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2.68 లక్షల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో అత్యధికంగా 24,383 కేసులు నమోదు కాగా.. ముంబైలో 11,317.. బెంగళూరులో 20,121.. చెన్నైలో 8,963.. కోల్‌కతాలో 6,867 కేసులు వెలుగుచూశాయి. 1,22,684 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం 14,17,820 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కోవిడ్ పాజిటివ్ రేటు 16.66 శాతానికి చేరింది.
మరోవైపు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లోనూ పంజా విసురుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటివరకు దేశంలో 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు వెలుగుచూశాయి. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు విజృంభించడంతో భారత్ లో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్టు వైద్య, ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.