ఉగాది పండుగ రోజు ఆకాశంలో అద్బుత దృశ్యాలు కనిపించాయి. కాంతులు విరజిమ్ముతు గుర్తు తెలియని వస్తువులు ఆకాశం నుంచి నేల రాలాయి. దీన్ని అందరూ ఉల్కాపాతంగా భావించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ అద్బుతమైన దృశ్యాలు అందరికి కనువిందు చేశాయి.
మహారాష్ట్రలోని అమరావతి, విదర్భ, నాగ్ పూర్, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, బైతుల్, భోపాల్‌లలో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ప్రజలు వీటిని కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆకాశంలో శనివారం రాత్రి వెలుగులు చిమ్ముతు ఆ వస్తువులు నెలరాలిన తర్వాత మహారాష్ట్రలోని చంద్రాపూర్ లోని లబ్దోరీ గ్రామంలో పలు లోహపు ముక్కలను, మూడు మీటర్ల లోహపు రింగును, ఇతర వస్తువులను ప్రజలు గుర్తించారు. దీనిపై అధికారులకు సమాచారం అందించారు.
నిపుణులు వీటిని పరిశీలించిన తర్వాత ప్రాథమికంగా శాటిలైట్ శకలాలుగా అంచనా వేశారు. ఆ తర్వాత వీటిని ఎలక్ట్రాన్ రాకెట్ బూస్టర్ ముక్కలుగా గుర్తించారు. న్యూజిలాండ్ కు చెందిన రాకెట్ ల్యాబ్ కంపెనీ ఎలక్ట్రానిక్ రాకెట్ ద్వారా బ్లాక్ స్కై ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించిందని, ఆ సమయంలో రాకెట్ కాలిపోయి శాటిలైట్ పరికరాలు నేలరాలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.