ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీలో లుకలకలు బయపడ్డాయి. పార్టీ చీఫ్‌ను టార్గెట్ చేసుకుని కొందరు సీనియర్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం వుంది. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలు సీన్‌లోకి ఎంటర్ అయినట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా వారు ఢీల్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి విషయాలను పార్టీ శ్రేణుల నుంచి ట్రబుల్ షూటర్ అమిత్ షా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటోంది. ఇలాంటి సమయంలో గొడవలు పార్టీకి నష్టం కలిగిస్తాయని నేతలకు వారు సర్ధి చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ నేతలు చాలా క్రమశిక్షణతో ఉండాలని నేతలకు హైకమాండ్ సూచిస్తోంది. ఇది ఇలా వుంటే చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆ పదవికి రాజీనామా చేస్తారంటూ వార్తలువస్తున్నాయి.
దీనిపై ఈటల స్పందించారు. ఆ వార్తలను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపాయి. సంజయ్ వ్యాఖ్యలను సొంత పార్టీ నేత, ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి దానికి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.
ఆ వ్యాఖ్యలకు మరి కొందరు సీనియర్ నేతలు వంత పాడారు. ఈ క్రమంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. బండి సంజయ్ అధ్యక్ష హోదాలో మాట్లాడారని ఆయన తెలిపారు. ఏదైనా ఇబ్బంది వుంటే సంజయ్ తో అరవింద్ నేరుగా మాట్లాడి వుండాల్సిందన్నారు.