అమ్మాయిల అభిరుచులు సాఫ్ట్ వేర్ లా రోజు రోజుకీ అప్ డేట్ అయిపోతున్నాయి. వాళ్ళ ఆశలు కలలు అందుకోవడానికి వరుడు కాబోయే అబ్బాయిల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ప్రధానంగా అమ్మాయిలు నగర జీవితానికే ఇష్టపడుతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయితే సరి. గవర్నమెంటు ఉద్యోగస్తుడైనా ఓకే. ఇదేమీ కాని వాళ్ళు అమ్మాయిలకు కాని వాళ్ళైపోతున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ యువకుడు తన బాధను ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నాడు. తనకు మంచిపిల్లను చూసి పెళ్ళి చేయండి మహాప్రభో అని వేడుకున్నాడు. ఇప్పుడీ సంభాషణ వైరల్ గా మారింది.
శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కన్నాడ్ ఎమ్మెల్యే ఉదయ్ సింగ్ రాజ్ పుత్ ను ఓ కార్యకర్త కోరాడు. తాను పెళ్ళి చేసుకునేందుకు ఓ అమ్మాయిని చూసిపెట్టాలని.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిదే అసలు సమస్య అంటూ వివరించాడు.వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఖుల్తాబాద్ ప్రాంతానికి చెందిన ఓ కార్యకర్త ఎమ్మెల్యేకు ఫోన్ చేసాడు. తనకు జీవిత భాగస్వామిని చూడాలని కోరాడు. ‘‘నాకు తొమ్మిది ఎకరాల భూమి ఉంది. కానీ, నేను పెళ్లి చేసుకుంటానంటే ఎవరూ పిల్లని ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. కన్నాడ్ లో అమ్మాయిలు ఉన్నారు” అని తెలిపాడు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. తనకు బయోడేటా పంపాలంటూ కార్యకర్తకు సూచించినట్టుగా ఆడియో రికార్డ్ అయ్యింది.
మరోవైపు ఈ అంశంపై ఎమ్మెల్యే రాజ్ పుత్ ఇటీవల ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న ఈ సమస్య తీవ్రతను ప్రతిబింబిస్తోందన్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ తనకు చాలా వస్తున్నాయని చెప్పారు. “పరిస్థితి ఏమీ అంత బాగాలేదు. గ్రామంలో 2 వేల మంది జనాభా ఉంటే.. వారిలో 100 నుంచి 150 మంది వరకు అవివాహిత యువకులే ఉంటున్నారు. వాళ్ళకు 100 ఎకరాల భూమి ఉన్నా సరే… పెళ్ళికోసం వారికి అమ్మాయిని చూడటం కష్టంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాల వారికే తమ కుమార్తెలను ఇచ్చి పెళ్ళి చెయ్యాలని కొన్ని కుటుంబాలు చూస్తున్నాయి” అని అన్నారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2019-21)ప్రకారం మహారాష్ట్ర లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 920 మంది మహిళలు ఉన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు, నిరక్ష్యరాస్యత, వైద్య సాంకేతికత తదితర అంశాల కారణంగా మన దేశంలో లింగ నిష్పత్తి గాడి తప్పిందన్నది వాస్తవం. ఇప్పటికైనా ఆలోచనా పద్ధతులు మార్చుకుని, వివక్ష తగ్గించుకుంటే మంచిది…లేదంటే అమ్మాయిల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు.