హిట్ సినిమాలపై తనదైన శైలిలో విశ్లేషణలు అందిస్తుంటారు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి పలుకులు అంటూ ఈయన ఇచ్చే క్లాసులు చాలా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడీ స్టార్ రైటర్.. మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట స్క్రిప్ట్ పై విశ్లేషణ చేశారు.
సర్కారువారి పాట సినిమాకు ఓ కీలకమైన మార్పు చెప్పారు పరుచూరి. మహేష్ పాత్రతో పాటు, హీరోయిన్ కీర్తిసురేష్ పాత్రను కూడా ఒకేసారి అమెరికా నుంచి ఇండియాకు దించితే సినిమా రేంజ్ మరో లెవెల్లో ఉండేదని పరుచూరి అభిప్రాయం.
“సర్కారువారి పాట సినిమాలో ముందుగా అమ్మాయిని ఎదుర్కొని, ఆ తర్వాత మహేష్ బాబు, ఆమె తండ్రిని ఎదుర్కొంటాడు. ఇది విడివిడిగా చూపించారు. ఇది కరెక్ట్ కాదు. ఏ అమ్మాయి అయితే హీరో మీద కోపంతో ఉందో, ఆ అమ్మాయి చదువు పూర్తిచేసుకొని, హీరోతో పాటు సేమ్ ఫ్లైట్ లో రావాలి. ఇద్దరూ కలిసి ఒకేసారి ఇండియాలో దిగాలి. అప్పుడు అమ్మాయి తండ్రిని ప్రవేశపెట్టాలి. ఈ అమ్మాయే కాదు, హీరోయిన్ కంటే ఆమె తండ్రి ఇంకా భయంకరం అని చూపించాలి. ఇలా చూపిస్తే వ్యక్తిగత సమస్య నుంచి వ్యవస్థాగత సమస్యగా మారుతుంది. ఇది సరిగ్గా ఉండేది. ఇలా వర్కవుట్ చేసినట్టయితే సినిమా ఇంకా బాగుండేది.”
సెకెండాఫ్ లో మహేష్-సముత్తరఖని మధ్య సీన్లు కూడా వరుసపెట్టి రావడంతో బోర్ కొట్టిందని, అక్కడ కీర్తిసురేష్ ను ఇంకాస్త ఎక్కువగా వాడుకొని ఉండాల్సిందని పరుచూరి అభిప్రాయపడ్డారు.