తూర్పుగోదావరి జిల్లా గోదావరిలో పర్యటక బోటు మునిగింది. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగినట్లు సమాచారం. 62 మంది పర్యటకులతో పాపికొండలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పర్యటకులు లైఫ్ జాకెట్లు ధరించినట్లు సమాచారం. 24 మందిని తూటుగుంట గ్రామస్థులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. బోటు డ్రైవర్లు నూకరాజు, తామరాజు మృతి చెందారు. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు రాయల్ వశిష్ట బోటు బయల్దేరింది.
గోదావరి కొంత కాలంగా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బోట్లు తిరిగేందుకు అనుమతి లేదు. అయితే తాజాగా వరద ప్రవాహం తగ్గటంతో పర్యటకానికి అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఫోన్లో మాట్లాడారు. రాజమహేంద్రవరం నుంచి సహాయ చర్యల కోసం హెలికాప్టర్ బయల్దేరింది. నీటి ఉద్ధృతి, సహాయ చర్యలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.
పోలవరం నుంచి పోచమ్మగండికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. రోడ్డు మార్గం లేనందున బోటులో ఘటనాస్థలికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఘటనాస్థలికి వెళ్లేందుకు రెండు గంటల సమయం పడుతుందన్నారు.
ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలానికి పర్యాటకశాఖమంత్రి అవంతి శ్రీనివాస్ హుటాహుటిన బయల్దేరారు. ప్రమాదంపై జిల్లా యంత్రాంగాన్ని విపత్తుల శాఖ కమిషనర్ అప్రమత్తం చేశారు. ఘటనాస్థలికి 2 బృందాలను పంపారు. ఒక్కో ఎన్డీఆర్‌ఎఫ్ బృందంలో 30 మంది సభ్యులు ఉన్నారు. కాసేపట్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోనున్నాయి. బోటు ప్రమాదంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.