సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చి.. మళ్లీ తిరిగి గమ్య స్థానాలకు చేరుకునే ప్రయాణికులకు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగిత్యాలలోని కోరుట్ల, మహబూబాబాద్ లోని మరిపెడతో పాటు పలు బస్ స్టాండ్ లలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిపోల్లోని బస్సుల్లో దాదాపు అధిక శాతం ఖమ్మం బీఆర్ఎస్ సభకు వెళ్తుండటంతో.. ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోలో మొత్తం 39 బస్సులు ఉంటే అందులో 15 బస్సులు బీఆర్ఎస్ సభ కోసం వెళ్లాయి.
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ బస్ స్టేషన్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం వెళ్లేందుకు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేని పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఉదయం నుంచి వెళ్లేందుకు బస్సులు లేవని, ఉన్న కొన్ని బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయని మండిపడుతున్నారు. బస్సులు సమయ పాలన పాటిస్తే బాగుంటుందన్నారు. బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ స్థాపించి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు పంజాబ్, కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులు, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ హాజరుకానున్నారు. అలాగే యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా తదితరులు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ బస్సుల ద్వారా జన సమీకరణ చేస్తోంది.