పాతబస్తీలో పరిస్ధితి ఏంటో గ్రేటర్ ఎన్నికలు బాగా చూపిస్తున్నాయి. ఎవరి అజెండా వారిది.. ఎవరి లక్ష్యం వారిది.. ఆ ఊపులో లేని ఆవేశాన్ని తెచ్చుకుని మరీ మాట్లాడేస్తున్నారు. ఆ మాటలలో నిజాలు బయటికొచ్చేస్తున్నాయి. అసలు అక్కడ పరిస్ధితి ఎలా ఉంటుందో తెలిసిపోతోంది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే రోహింగ్యాలున్నారనే చర్చను రేపారు. ఎవరి లెక్కలు వారు చెప్పినా.. మొత్తం మీద కొందరైతే ఉన్నారన్న వాస్తవం అందరూ ఒప్పుకున్నారు. వారికి ఓటు హక్కు కల్పించాలని ఎంఐఎం అడిగిన విషయం కూడా బయటపడింది.
ఇక ఎంఐఎం నేతలైతే ఇంకా బాగా నిజాలు ఒప్పేసుకుంటున్నారు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలున్నాయని స్వయంగా అక్బరుద్దీన్ ఒవైసీ ఒప్పుకున్నారు. అందుకే పేదల ఇళ్లు అక్రమమని పడేయటానికి వస్తారు గాని.. పీవీ సమాధి, ఎన్టీఆర్ సమాధులు కూల్చేయగలరా అని సవాల్ చేశారు. వ్యక్తిగతంగా కట్టుకున్నవాటికి.. ప్రభుత్వమే కట్టించినవాటికి పోలిక పెట్టారు మహానుభావుడు. ఎమ్మెల్యే మౌజం ఖాన్ అయితే ఏకంగా పాతబస్తీలో కరెంటు బిల్లులు సరిగా కట్టరని ఒప్పేసుకున్నారు. కరెంటు బిల్లు కావాలని మనిషి రాలేడు.. బిల్లు కట్టలేదని కరెంట్ పీకేయలేడు.. మీటర్ల చెకింగ్ అసలే చేయలేరు.. ఎందుకంటే ఎంఐఎం ఉంది కాబట్టి అని ఆయనే స్వయంగా అన్నాడు. పాతబస్తీ పరిస్ధితి అదే. ఏ అధికారి ధైర్యం చేసి ఏం చేయాలని చూడడు.. ఏం చేయాలనుకున్నా సరే.. వాడి వల్ల కాదు. తెగించి వెళ్లినా.. వెనక్కు రాలేడు. వాడిని తరిమి తరిమి కొడతారు. అలా ఉంటుంది వ్యవహారం. మొదటి నుంచి కాంగ్రెస్ తో, ఇప్పుడు టీఆర్ఎస్ తో మెయిన్ టెయిన్ చేస్తూ.. ఎక్కడ ఏ పోలీసు వచ్చినా ఫోన్ చేయించి వెనక్కు పంపడం ఇక్కడి నేతలకు అలవాటు. ఏ అధికారి పాతబస్తీలోకి తొంగి చూడలేడు. అంత ధైర్యం కూడా చేయలేడు. అలా చేయగలిగిన మహంతిలాంటి అధికారులను ఇప్పటికి చెప్పుకుంటూ ఉంటారు. అంత రేర్ అన్నమాట.
మొత్తం మీద అన్ని విషయాలను పరిశీలిస్తే మనకు అర్ధమయ్యేదేంటంటే.. పాతబస్తీలో ఉన్న ముస్లింలలో అనేకమంది పేదలున్నారు. వారెవరూ కరెంటు బిల్లు కట్టలేరు.. రూల్స్ పాటించలేరు. వారి బలహీనతను అడ్డం పెట్టుకుని ఎంఐఎం లాంటి పార్టీలు ఆడుకుంటున్నాయి.. బలం పెంచుకుంటున్నాయి. అంతేకాని వారికి పేదరికం లేకుండా చేసే కార్యక్రమం మాత్రం చేయటం లేదు. ఎంఐఎం బలాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్, టీఆర్ఎస్ లాంటి పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి. ఈ బలహీనతలవల్లే ఉగ్రవాదం కూడా పాగా వేయడానికి అవకాశం ఇస్తున్నట్లు అయింది.
ఇలా జరుగుతుంది కాబట్టే.. బిజెపికి నేడు అలా మాట్లాడానికి అవకాశం ఇచ్చినట్లయింది. రోజూ కళ్లెదురుగా చూస్తుంటారు కాబట్టే… బండి సంజయ్ అంత పరుషంగా మాట్లాడినా.. హద్దులు దాటినా.. సమర్ధిస్తున్నారు. వారి బలం పెంచుతున్నారు. కాని అందరూ కలిసి.. పాతబస్తీని అభివృద్ధి చేయటానికి.. అక్కడ ఉంటున్న పేద ముస్లింల జీవితాలను మెరుగుపర్చటానికి ఇప్పటికైనా కృషి చేస్తే మంచిది.