దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత షారూక్ ఖాన్ చేస్తున్న సినిమా పఠాన్. విడుదలకు ముందే ఈ మూవీ వివాదాస్పదమైంది. ఇందులోని భేషరమ్ సాంగ్ పై చాలా విమర్శలు చెలరేగాయి. దీపికా పదుకోన్ అందాల ప్రదర్శనపై మరీ ముఖ్యంగా ఆమె ధరించిన కాషాయ రంగు బికినీపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. అందరూ ఊహించినట్టుగానే బేషరమ్ పాటపై సెన్సార్ అధికారులు కత్తెర ఝులిపించారు. ఏకంగా 3 సీన్లను కట్ చేశారు. వీటిలో దీపిక అందాల ప్రదర్శనతో పాటు, వివాదాస్పద బికినీ షాట్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు పాటలో ఓ డాన్స్ మూమెంట్ పై కూడా సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక సినిమా విషయానికొస్తే.. మొత్తంగా 10కి పైగా కట్స్ సూచించింది సెన్సార్ బోర్డ్. వాటన్నింటినీ సినిమా నుంచి తొలిగించిన తర్వాత యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.
కట్స్ అనంతరం ఈ సినిమా నిడివి 2 గంటల 26 నిమిషాలుంది. సిద్దార్థ్ ఆనంద్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. తాజా వివాదాల నేపథ్యంలో.. మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకుండానే ఈ సినిమాను విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. 25న థియేటర్లలోకి వస్తోంది పఠాన్ మూవీ.