ఇదేమైనా సినిమా హాల్ అనుకున్నారా? మీరు ఏ డ్రెస్ లో పడితే ఆ డ్రెస్ లో ఇక్కడికి రావడానికి.. ఇది కోర్టు.. మీరొక ఐఏఎస్ అధికారి.. ఆ మాత్రం మీకు తెలియదా..? ఎక్కడ ఎలా ఉండాలి..? అనేది అంటూ ఓ జడ్జి.. ఐఏఎస్ అధికారిపై కారాలు మిరియాలు నూరారు. ఇంతకు ఎవరు ఆ జడ్జీ, ఎవరు ఆ ఐఏఎస్ అధికారి అనేగా మీ డౌట్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా మహమ్మారి మన దేశంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కోర్టు కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ఆటంకాలను అధిగమించడానికి వర్చువల్ హియరింగ్ ను సుప్రీంకోర్టు ముందుకు తెచ్చింది. ఇలా రావడం వల్ల కొన్ని ఆసక్తికరమైన వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో క్లిప్ లో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ఐఏఎస్ అధికారిపై మండిపడ్డారు. కోర్టులో ఎలాంటి డ్రెస్ వేసుకుని రావాలో తెలియదా అంటూ బీహార్ రాష్ట్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనంద్ కిశోర్ పై ఫైరయ్యారు. దాదాపు రెండు మూడు నిమిషాల పాటు ఆయనపై ఆగ్రహంగా వ్యాఖ్యలు చేశారు. ఇదేమైనా సినిమా హాల్ అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు.
ఐఏఎస్ ఆఫీసర్ ఆనంద్ కిశోర్ పాట్నా హైకోర్టు లోకి ఓపెన్ కాలర్ తో తెల్ల చొక్కా వేసుకొని వచ్చారు. ఆయన డ్రెస్సింగ్ చూసి పాట్నా న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. కోర్టులో ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలో తెలియదా? కోర్టులో ఎలా నడుచుకోవాలో శిక్షణ సమయంలో మీకు నేర్పలేదా? ముస్సోరిలోని ట్రైనింగ్ స్కూల్ కు మీరు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. ఎలాంటి డ్రెస్ వేసుకుని వచ్చారు? అసలు బిహార్ ఐఏఎస్ అధికారులకు ఏమైంది? వారికి కోర్టులో ఎలా అప్పియర్ కావాలో తెలియదా? అని ప్రశ్నించారు. ఫార్మల్ డ్రెస్ అంటే కనీసం కోటు వేసుకోవాలని అన్నారు. కాలర్ ఓపెన్ ఉంచకూడదని వివరించారు.
ఆనంద కిశోర్ జడ్జి వ్యాఖ్యలపై స్పందించారు. తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అలాంటి అధికారిక నిబంధనలు ఏవీ లేవని సమాధానం చెప్పారు. ఆయన వివరణతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. కోర్టుకు వచ్చేటప్పుడు కచ్చితంగా ప్రాపర్ డ్రెస్ కోడ్ పాటించాలని సూచించారు.