రంగారెడ్డి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన పట్నం బ్రదర్స్ పూర్తిగా స్తబ్దుగా అయిపోయారు. కుటుంబంలో 4 పదవులు ఉన్నప్పటికీ జిల్లా రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు. గత ప్రభుత్వంలో మంత్రిగా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి, జిల్లా పరిష్యత్ చైర్మన్ గా మహేందర్ రెడ్డి భార్య సునీత, జడ్పీటీసీ గా మహేందర్ రెడ్డి కొడుకు ఇలా కుటుంబం లో పదవులతో పాటు జిల్లా రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం కూడా ఉండేది.
సీఎం దగ్గర మంచి పరపతి ఉన్న మహేందర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండేవారు. 2018 ముందస్తు ఎన్నికల తరువాత తాండూరులో మహేందర్ రెడ్డి ఓటమి తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. కొడంగల్‌లో పట్టుదలతో రేవంత్‌రెడ్డిని ఓడించినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినా… పెద్దగా పట్టించుకున్నట్లు కనపడటం లేదు. పైగా పట్నం బ్రదర్స్‌తో గిట్టని వారి బంధువైన సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకరావటం, మంత్రిని చేయటం వారికి ఇంకా మింగుడు పడటం లేదని వారి సన్నిహితులంటున్నారు.
అయితే, పట్నం బ్రదర్స్ కు పదవులు మిగిలాయి కానీ జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం మాత్రం లేకుండా పోయింది. మహేందర్ రెడ్డి తమ్ముడు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. కొడంగల్ లో కూడా పెద్దగా కనిపించడం లేదు, అభివృద్ధి ఊసే లేదు, అప్పుడప్పుడు కార్యకర్తల ఇండ్లలో శుభకార్యాలకు తప్ప పెద్దగా కనిపించడం లేదు. సొంత నియోజకవర్గం తాండూరు లో కూడా మహేందర్ రెడ్డి అతిథిగా మారిపోయారు. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడం తో, కేటీఆర్ దగ్గర రోహిత్ కు మంచి పలుకుబడి ఉండడం తో స్థానిక టిఆర్ఎస్ క్యాడర్ కుడా రోహిత్ వైపు వెళ్లిపోయారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. మహేందర్ రెడ్డి అనుచరులు కూడా పైలెట్ రోహిత్ తో సన్నిహితంగా ఉంటున్నారు.
దీంతో… నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయలేక, అలాగని ఊరుకోలేక అసంతృప్తితో పట్నం బద్రర్స్ రగిలిపోతున్నారు అంటున్నారు తాండూరులోని కాంగ్రెస్ కార్యకర్తలు.