– హీటెక్కిన తాండూరు రాజకీయం
– టీఆర్‌ఎస్ నేతల మధ్య లొల్లి
– పట్నం వర్సెస్ పైలెట్
– ఇద్దరి మధ్య పేలుతున్న పంచ్ లు
తాండూరు టీఆర్‌ఎస్‌లో కల్లోలం మొదలైంది. పట్నం మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ అంతకంతకూ పెరుగుతోంది. ఇన్నాళ్లూ గప్ చుప్ గా సాగిన వీరి యుద్ధం ఇప్పుడు బజారునపడింది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగడంతో ఈ వివాదం కాస్తా.. మరింత ఇంట్రస్టింగ్ గా మారింది.
తాండూరు సీఐను దూషించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఐపీసీ 353, 504, 506 కింద కేసు పెట్టారు పోలీసులు. అయితే.. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని తాను సీఐని తిట్టలేదని అంటున్నారు మహేందర్ రెడ్డి. అంతా రోహిత్ రెడ్డి కావాలని చేసిన కుట్ర అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ తనదేనని ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
మహేందర్ రెడ్డి కామెంట్స్ తో రోహిత్ రెడ్డి హర్ట్ అయ్యారు. వెంటనే మంత్రి కేటీఆర్ ముందు వాలిపోయారు. తాండూరు రాజకీయాలు, మహేందర్ రెడ్డి కామెంట్స్ పై చర్చించారు. అంతటితో ఆగకుండా మహేందర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు తాండూరులో తనకు మహేందర్ రెడ్డి పోటీనే కాదన్నారు. అనవసరంగా ఆయన సీఐని బండ బూతులు తిట్టారని ఆరోపించారు. తన ఉనికి కాపాడుకునేందుకే మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో తాండూరు టికెట్ తనకే వస్తుందని తెలిపారు.
మరోవైపు.. మహేందర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. యాలాల పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 355, 504, 506 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇందిరాచౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. పట్నం తాండూరు సీఐకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.