– ప్రశ్నిస్తే బెదిరింపులు..
– ఎదురు తిరిగితే దాడులు.. అక్రమ కేసులు
– మా జోలికి వస్తే..నీ భూమి జోలికి వస్తాం!
– వ్యాపారస్తుల నుంచి మామూళ్లు
– కొడంగల్ లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు!
2018 ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి గెలిచిన తరువాత పోలీసులకు పని ఎక్కువైందనే వాదన నియోజకవర్గంలో బలంగా ఉంది. గులాబీ పార్టీ కానివారు ఎవరైనా స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే. ఉంటే అధికార టీఆర్ఎస్ లో ఉండాలి.. లేదంటే అన్నీ మానేసి ఇంట్లో ఉండాలి. కాదని ఎవరైనా వ్యాపారం చేసినా, రియల్ ఎస్టేట్, క్రషర్ మిషన్ ఉన్నా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందే.
ఎమ్మెల్యే నరేందర్ కొడంగల్ లో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అభివృద్ధిని కాకుండా, దౌర్జ్యన్యాన్ని నమ్ముకున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తనకు ఎవరూ ఎదురుతిరిగినా అక్రమ కేసులతో జైలుకు పంపుతున్నారట. పోలెపల్లి అనే ఒక్క గ్రామంలోనే 40 మందిపై అక్రమ కేసులు పెట్టించారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేపల కోసం పంటలు ఎండబెడుతాం అంటే కొందరు యువకులు రైతులకు అండగా నిలబడ్డారు. దాంట్లో చిన్న గొడవ జరిగింది. ఒక టీఆర్ఎస్ నేత చొక్కా బటన్ ఊడింది. దీనికే ఏడుగురిపై 307 కింద కేసు నమోదైంది. అసైన్డ్ ల్యాండ్ ను కొందరు అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తే దాన్ని ప్రశ్నించినందుకు 12 మందిపై కేసులు పెట్టారు. ఇలా తమ ఒక్క ఊర్లోనే 40 మందిపై అక్రమ కేసులు బనాయించారని వాపోతున్నారు బాధితులు.
ఇక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని బ్యాగరి నర్సింహ, సింగర్ నర్సింహ అనే ఇద్దరు వ్యక్తులపై కక్ష కట్టి రిమాండ్ చేశారు. వారితోపాటు ఇంకా చాలా మందిని ఇలాగే చేశారని ఆరోపణలు ఉన్నాయి. హకీంపేట్ గ్రామంలో కూడా ఎమ్మెల్యే అరాచకాలకు అంతే లేకుండా పోయిందని చెబుతున్నారు గ్రామస్తులు. తన ఇంట్లో ఇద్దరు భర్తలు చనిపోయిన మహిళలు ఉన్నారు.. వాళ్లకు పెన్షన్ రావడం లేదని, అలాగే తన అన్న చనిపోతే రైతు భీమా రాలేదని బాలరాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మామతో పాటు గులాబీ రౌడీలు ఆ గ్రామంపై దాడి చేసి బాధిత వ్యక్తిని, అతని కుటుంబ సభ్యులను చితకబాదారు.
కోస్గి పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు అనే విమర్శలు పెద్దఎత్తున ఉన్నాయి. ఇంతకు ముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేసిన రామ్ లాల్, ప్రస్తుత ఎస్సై ఇద్దరు అధికార పార్టీ కార్యకర్తల్లా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు ప్రజల ఇళ్లపైకి వెళ్లి చావు దెబ్బలు కొట్టినా కేసులు ఉండవని.. అదే తమపై మాత్రం అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే మామ కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం వల్ల పోలీసులు అతను చెప్పిందే వేదంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. కోస్గి కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జనార్ధన గౌడ్ వచ్చిన తరువాత కాస్త అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు తగ్గాయి అని స్థానికులు అంటున్నారు.
కోస్గిలో వ్యాపారం చేసుకునే ఎవరైనా సరే గులాబీ నేతలకు మామూళ్లు ఇవ్వాల్సిందేనట. లేదంటే పోలీసుల వేధింపులు తప్పవు అని వాపోతున్నారు వ్యాపారస్తులు. కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా వాళ్ళను కంట్రోల్ చేయాలని వేడుకుంటున్నారు. ఇక కొడంగల్ సర్కిల్ పరిధిలో దౌర్జన్యాలు మాములుగా లేవని టాక్. పోలీసులు పూర్తిగా నరేందర్ రెడ్డి జేబులో మనుషులు అనే విమర్శలు ఉన్నాయి. 50 సంవత్సరాల వయసున్న అనిత అనే మహిళ రోడ్డు బాగోలేదు, మా కార్లు దెబ్బతింటున్నాయని అన్నందుకు నరేందర్ రెడ్డి తన మనుషులతో కొట్టించి, రోజంతా కొడంగల్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. తుంకిమెట్ల అనే గ్రామంలో ఒక యువకుడు సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే కేసులు నమోదు చేశారు. దౌల్తా బాద్ లో ఒక యువకుడు ఎమ్మెల్యేను నిలదీస్తే ప్రైవేట్ రౌడీలతో కొట్టించి కేసులు పెట్టించిన చరిత్ర నరేందర్ రెడ్డిది.
కొడంగల్ లో సమస్యలు తిష్ట వేసినప్పటికీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాత్రం రౌడీయిజం నమ్ముకున్నారని నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. కేటీఆర్ దత్తత తీసుకున్నప్పటికీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరగడం లేదట. రౌడీ రాజ్యం.. కేరాఫ్ కొడంగల్ పై వరుస కథనాలు తొలివెలుగులో కొనసాగుతాయి.