పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారారు. ఒక వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను నమోదు చేసుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేస్తున్నారు. అలాగే, సురేందర్ రెడ్డితో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక ఇటీవల పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ రూపొందనుందంటూ ప్రచారం నడుస్తుంది. ఈ మామ అల్లుళ్ల కలయికలో కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వినోదయ సీతమ్’ను తెలుగులో రూపొందించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ రీమేక్ మూవీ కూడా పట్టాలెక్కడానికి ముహర్తం ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో పూజాకార్యక్రమం నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని నటించి దర్శకత్వం వహించిన ‘వినోదయ సీతమ్’ చిత్రం కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. యాక్సిడెంట్‌లో కన్నుమూసిన ఓ వ్యక్తి.. దేవుడి అంగీకారంతో తిరిగి తొంభై రోజుల పాటు జీవించే అవకాశాన్ని పొందిన తర్వాత ఏం జరిగిందనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక, తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు సముద్రఖని కథలో చాలా మార్పులు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. జీస్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. మామ అల్లుళ్ల కలయికలో రూపొందనున్న తొలి సినిమా ఇదే కావడం వల్ల మెగా అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.