నటుడు, రాజకీయనాయకుడు పవన్ కల్యాణ్, మరోసారి తన పెళ్లిళ్లపై స్పందించారు. ఈ నటుడు నిజజీవితంలో 3 పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అలా తనకు 3 పెళ్లిళ్లు జరిగాయనే విషయం తలుచుకున్న ప్రతిసారి తనకు ఆశ్చర్యంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు ఈ నటుడు.
అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాడట పవన్. యోగ మార్గంలో వెళ్తూ బ్రహ్మచారిగా ఉండిపోవాలని అనుకున్నాడట. అలాంటి మనస్తత్వంతో ఉన్న తను 3 పెళ్ళిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని, ఆ విషయం తలుచుకున్న ప్రతిసారి తనకు తానే ఆశ్చర్యపోతుంటానని అన్నారు.
మనస్తత్వాలు కలవనప్పుడు విడిపోవడమే మంచిదనేది తన అభిప్రాయమని, అందుకే మొదటి భార్యకు విడాకులిచ్చానని తెలిపారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత రెండో భార్య (రేణుదేశాయ్) విషయంలో కూడా అదే జరిగిందన్నారు. తమ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. అలా మూడో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్నారు పవన్ కల్యాణ్.
అయితే తను ఎవ్వరికీ అన్యాయం చేయలేదనేది పవన్ వాదన. ప్రతి భార్యకు చట్టబద్దంగా విడాకులిచ్చిన తర్వాతే మరో పెళ్లి చేసుకున్నానని అంటున్నారు పవన్. కొంతమంది తన 3 పెళ్లిళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, తనకు మాత్రం ఎలాంటి గిల్ట్ లేదని అన్నారు.