సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. వీళ్లలో హీరో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే పవన్ కల్యాణ్ కు ప్రత్యేక అభిమానం. ఆ అభిమానాన్ని ఆయన ఎప్పటికప్పుడు బయటపెట్టారు కూడా. తాజాగా సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా.. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు పవన్.
“సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా విడుదలైన ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి చూశాక – ఆ అక్షర తపస్విని మొదటిసారి ‘రుద్రవీణ’ సినిమా సమయంలో కలసిన సందర్భం గుర్తుకు వచ్చింది. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకొన్నాను. ఆ సందర్భంలో శాస్త్రి గారితో భేటీ ఆయ్యేవాణ్ణి. ఆ చిత్రంలో ‘చుట్టూపక్కల చూడరా చిన్నవాడా’ పాటలో చివరి చరణం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.”
ఆ పంక్తులు ఇప్పటికీ తన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయన్నారు పవన్ కల్యాణ్. తనను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం విధిగా భావిస్తానని.. ఏరు దాటాకా అవసరం తీరిందని తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఒకసారి శాస్త్రి గారి సాహిత్యాన్ని చదివాలని సూచించారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం పేరిట ప్రస్తుతానికి ఒక సంపుటి మాత్రమే వచ్చింది. తానా, సిరివెన్నెల కుటుంబం కలిసి ఈ సంపుటాల్ని విడుదల చేస్తోంది.