పవన్ కల్యాణ్ తన లైనప్ మార్చిన సంగతి తెలిసిందే. సముత్తరఖని దర్శకత్వంలో చేయాల్సిన వినోదాయశితం, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్టుల్ని పక్కనపెట్టాడు. వాటికంటే ముందు హరీశ్ శంకర్, సుజీత్ సినిమాలను తెరపైకి తీసుకొచ్చాడు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడీ సినిమాల నుంచి ఓ జానర్ ను మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో లెక్కప్రకారం, ఓ గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ చేయాలి పవన్ కల్యాణ్. ఆ సినిమాను కొన్నాళ్లు ఆపేశాడు. అయితే ఆ జానర్ ను మాత్రం రిపీట్ చేస్తున్నాడు.
సుజీత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ తో రాబోతోంది. దీనికి సంబంధించి అనధికారికంగా లీక్స్ కూడా వచ్చేశాయి. పవన్ ఇందులో సిసలైన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు.
డీవీవీ దానయ్య బ్యానర్ పై రాబోతోంది పవన్-సుజీత్ సినిమా. ఇందులో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడనే విషయాన్ని ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ రోజునే పరోక్షంగా వెల్లడించారు. పోస్టర్ పై ఉన్న ఓజీకి అర్థం ఓరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ ఇప్పటికే చర్చ మొదలైంది.