ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే హడలిపోయే పరిస్థితికి వచ్చేశారు నిర్మాతలు-దర్శకులు. ఎప్పుడు ఏ సినిమా కన్ఫామ్ చేస్తారో తెలీదు. పక్కా చేసిన సినిమాకు ఎప్పుడు కాల్షీట్లు కేటాయిస్తారో తెలీదు. అలా కాల్షీట్లు ఇచ్చిన సినిమాకు ఎప్పుడు సెట్స్ పైకి వస్తారో తెలీదు. ఇలా పూర్తిస్థాయిలో అనిశ్చితి కొనసాగుతోంది.
ఇది చాలదన్నట్టు ఇప్పుడు తన సినిమాల ఆర్డర్ మార్చేస్తున్నారు పవన్. దీంతో నిర్మాతలు మరింత గందరగోళానికి గురవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, పవన్ ఓ కొత్త సినిమాను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ సినిమానే ముందుగా సెట్స్ పైకి వస్తుందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా నడుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న హరిహర వీరమల్లు పూర్తయిన వెంటనే సుజిత్ సినిమా సెట్స్ పైకి వస్తుందట.
నిజానికి ఈమధ్య హరీశ్ శంకర్ సినిమాకు పచ్చజెండా ఊపారు పవన్. మైత్రీ నిర్మాతల అడ్వాన్స్ దాదాపు ఆరేళ్లుగా తన వద్దే ఉండిపోవడంతో ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరమల్లు సినిమా తర్వాత ఇదే సెట్స్ పైకి వస్తుందని అంతా అనుకుంటున్న టైమ్ లో, ఉరుములేని పిడుగులా సుజిత్ సినిమా వచ్చి పడింది.
అసలు ఈ రెండు సినిమాల కంటే ముందు వినోదాయ శితం రీమేక్ ఎక్కువగా వినిపించింది. క్రిష్ మూవీ తర్వాత సముద్రఖని దర్శకత్వంలో సెట్స్ పైకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు సుజిత్ సినిమా తెరపైకొచ్చింది. ఇలా పవన్, తన సినిమాల ఆర్డర్ ను సీజన్ కు ఓసారి మార్చేస్తున్నారు. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత మరో సినిమా తెరపైకొస్తుందేమో చూడాలి.