భారతదేశం గర్వించదగ్గ గాయకుడు కేకే హఠాన్మరణం టాలీవుడ్ ను కలచివేసింది. ప్రముఖులంతా తమ సంతాపం తెలియజేస్తున్నారు. కేకే మృతిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
“ఖుషిలో కేకే పాడిన యే మేరా జహా అనే పాట అందరికీ చేరువైంది. అందుకు కేకే గారి గాత్రం ఓ ప్రధాన కారణం. జల్సాలో మై హార్ట్ ఈజ్ బీటింగ్, బాలు సినిమాలో ఇంతే ఇంతింతే, జానీలో నాలో నువ్వొక సగమై, గుడుంబా శంకర్ లో లే..లే..లే పాటలు పాడారు. అవన్నీ శ్రోతల్ని ఆకట్టుకోవడమే కాకుండా, సంగీతాభిమానులు హమ్ చేసుకునేలా సుస్థిరంగా నిలిచాయి” అని అన్నారు పవన్.
కేకే అకాల మృతిపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. తన సినిమాల్లో పాడిన పాటల్ని గుర్తు చేసుకున్నారు. కేకే కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. “కేకే హఠాన్మరణంతో నా గుండె బద్దలైంది. మంచి గాయకుడు మాత్రమే కాదు, మంచి మనిషి. నేను చేసిన ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా అనే పాట పాడింది అతడే” అని చెప్పారు.
ఇలా పవన్, చిరంజీవి మాత్రమే కాదు.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా కేకేతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అతడు పాడిన సూపర్ హిట్ సాంగ్స్, యూట్యూబ్ లో మరోసారి ట్రెండింగ్ లో నిలిచాయి.