కొన్ని రోజుల కిందటి సంగతి. పవన్ కల్యాణ్ పై వరుసపెట్టి ట్వీట్లు వేశాడు రామ్ గోపాల్ వర్మ. భీమ్లానాయక్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. తెలుగు వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు స్టోరీలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీ అయినప్పుడు.. రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లానాయక్ సినిమా ఎందుకు పాన్ ఇండియా సబ్జెక్ట్ అవ్వదని ప్రశ్నించాడు వర్మ.
ఈ మేటర్ పవన్ కల్యాణ్ వరకు వెళ్లిందా లేక నిర్మాతల దగ్గరకు చేరిందా అనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది భీమ్లానాయక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, భీమ్లా నాయక్ గురించి నాగవంశీని ప్రశ్నించినప్పుడు, “సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే మేము హిందీలో కూడా విడుదల చేస్తున్నాం” అంటూ ప్రకటించాడు నిర్మాత.
మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది భీమ్లానాయక్. కేవలం ఆ కథను మాత్రమే తీసుకొని, పవన్ స్టయిల్ కు తగ్గట్టు భీమ్లానాయక్ ను మార్చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకుడు.
సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది భీమ్లానాయక్.