ఏపీలోని వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది. ఇది ప్రస్తుతానికి బాగానే ఉన్నా.. రానున్న రోజుల్లో ప్రజలకు గుదిబండలా మారుతుందనేది ప్రతిపక్షాల వాదన. ధరలు విపరీతంగా పెరగడానికి ఈ అప్పులు దారి తీస్తాయని చెబుతున్నాయి. తాజాగా పార్లమెంట్ లో ఏపీ అప్పులకు సంబంధించిన వివరాలను కేంద్రం ప్రకటించింది. దీంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఏపీ అప్పులపై ప్రశ్నించగా.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ లెక్కలన్నీ చూస్తే.. 2019తో పోలిస్తే ఏపీ అప్పులు దాదాపు రెండింతలయ్యాయి. మొత్తం అప్పు ప్రస్తుతానికి రూ.4,42,442 కోట్లుగా తేలింది.
2019లో ఏపీ అప్పు రూ.2,64, 451 కోట్లుగా ఉంది. ఇది 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరుకుంది. బడ్జెట్ అప్పులకు తోడు, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఏపీ చేస్తున్న అప్పులు అదనమని కేంద్రమంత్రి వెల్లడించారు. ఓవరాల్ గా రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లకు చేరిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఏపీ అప్పుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘‘అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్ కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా మీకు అప్పురత్న అవార్డు ఇవ్వాలి’’ అని జగన్ కు చురకలంటించారు పవన్.