వారాహితో ప్రజాక్షేత్రంలో వెళ్ళేందుకు జనసేన సిద్ధమైంది. వారాహి మీద వచ్చిన అడ్డంకులన్నీ అదిగమించి ప్రముఖ ఆంజనేయ క్షేత్రాన్ని దర్శించేందుకు పవన్ నిర్ణయించారు. పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త యాత్ర కోసం ప్రత్యేకంగా వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా తయారుచేయించుకోవడం తెలిసిందే.
ఇటీవల ఈ వాహనం రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాయి. ఈ వాహనం రంగుసైతం రణరంగాన్ని తలపించింది. వైసీపీ నేతల నుంచి వ్యాఖ్యలు రావడం, అందుకు జనసేన నేతలు ధీటుగా బదులివ్వడం కూడా జరిగాయి.
ఈ నేపథ్యంలో, వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కల్యాణ్ తలపెట్టారు. త్వరలోనే జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వారాహి వాహనాన్ని తీసుకెళ్లనున్నట్టు జనసేన నేతలు వెల్లడించారు. అక్కడ వారాహికి పూజలు చేయించనున్నట్టు తెలిపారు.
అయితే, తేదీ ఇంకా ఖరారు కాలేదని నేతలు వివరించారు. కొండగట్టులో పూజలు చేయించిన తర్వాతే వారాహి వాహనాన్ని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి తీసుకెళతామని వారు వెల్లడించారు.