పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు
జనసేన పార్టీని స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. 9వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో 14న ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ సభకు ఆహ్వానితులే. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వేదికకు దూరంగా ఉన్నవారి కోసం ఎల్ఈడీ స్కీన్లు ఏర్పాటు చేశాం. ఈ సభకు నేను ఎంతగానో అభిమానించే దామోదరం సంజీవయ్య పేరు నిర్ణయించాం. వారి స్ఫూర్తిని కొనసాగిస్తాం.
ఈసారి సభను అన్ని ఆవిర్భావ దినోత్సవాల్లాగా చూడడం లేదు. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేయబోతున్నాం. గత రెండున్నరేళ్లలో ఏం జరిగింది? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు, ఉపద్రవాలు ఎదుర్కొన్నారు? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే బలమైన భవిష్యత్తు ఇవ్వగలం? వంటి అంశాలపై సభా వేదికపై మాట్లాడతా. అందుకే అందరూ వచ్చి సభను విజయవంతం చేసి క్షేమంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నా.
సభకు రానీయకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే వెళ్లడం మా హక్కు అని చెప్పండి. మన ఆవిర్భావ దినోత్సవం మన హక్కు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ శాఖ వారికి కూడా మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాం. సభకు పూర్తిగా సహకరించండి. ఈ కీలకమైన సభలో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై మాట్లాడబోతున్నా. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఎన్నో విమర్శలు చేశారు. వాటన్నింటిపై కూడా ఆవిర్భావ దినోత్సవంలో సమాధానాలు చెప్తాను.
9వ ఆవిర్భావ దినోత్సవానికి వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం. అలాగే దీనిని టీవీలో వీక్షించే వారికి, ప్రసారం చేసే మీడియా సంస్థలు, జర్నలిస్టులకు ధన్యవాదాలు. తెలుగు ప్రజల ఐక్యత కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ సభకు అందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.