జైహింద్ నినాదాన్ని ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ ని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. శిల్పకళావేదికలో నేతాజీ గ్రంథ సమీక్ష జరగగా ఆయన హాజరయ్యారు. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంవీఆర్ శాస్త్రి రచించిన నేతాజీ గ్రంథ సమీక్ష పుస్తకం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.
వంద రూపాయల నోటుపై సుభాష్ చంద్రబోష్ బొమ్మ ముద్రించాలన్నారు. నేతాజీ కోసం కొత్త తరం కదలాలని పిలుపునిచ్చారు. తాను సగటు మనిషినని..మేధావులంటే భయమని అన్నారు. ఎంవీఆర్ శాస్త్రి దాదాపు 20 పుస్తకాలు రచించారని.. కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సమయంలో పరిచయం ఏర్పడిందని చెప్పారు.
తాను సినిమా ఉచితంగా చేస్తానేమో కానీ.. పుస్తకాలను మాత్రం ఇవ్వనని అన్నారు పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ తన దగ్గరకు వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తానని తెలిపారు. అనంతపద్మనాభ స్వామి నేలమాలిగల్లో ఉన్న సంపద కంటే లైబ్రరీలో ఉండే పుస్తకాలే ఎక్కువ విలువైనవని వివరించారు.
నేతాజీ అస్థికలు ఇంకా రెంకోజీ ఆలయంలోనే ఉన్నాయని.. వాటిని భారత్ కు తిరిగి తీసుకురావాలన్నారు పవన్. అవి నిజంగా నేతాజీవేనా కాదా? అనే పరీక్షలు కూడా చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు వాటిని తీసుకొచ్చేందుకు మూడుసార్లు ప్రయత్నించినా కుదరలేదని.. నేతాజీ అస్థికలు దేశానికి తీసుకురావాలని ప్రజలు కోరుకోవాలన్నారు. ఇదే క్రమంలో #BringbackNetajiAshes హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచింది.