మరుగున పడిపోయిన వీరుడి చరిత్ర ఆధారంగా అంటూ ఇటీవలే సైరా నరసింహరెడ్డి సినిమాతో మంచి హిట్ కొట్టిన అన్న చిరంజీవి బాటలోనే ప్రయాణించబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే… ఈ చరిత్రలో తను వీరుడే అయినప్పటికీ, దొర-భూస్వాములను ఎదురించి… పేద ప్రజల కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్న అణగారిన వర్గాలకు ఒక్కపూట అయినా కడుపునింపాలన్న పోరాటం చేసిన విప్లవకారుడు కథతో ప్రజల ముందుకు రాబోతున్నాడు పవన్ కళ్యాణ్.
పెద్దొన్ని కొట్టడం… పేదోడికి పంచటం అన్నట్లుగా దొరలు, భూస్వాములను దోచుకొని పేదల ప్రజలకు పంచే పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 1860వ సంవత్సరం పాలమూరు జిల్లాలో పండుగ సాయన్నగా పేదల మన్నలను పొందిన కథతో సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. బందీపోటు దొంగ కథ అని అనుకుంటున్న సమయంలో… ఈ కథ పండుగ సాయన్నదన్న ప్రచారం సాగుతోంది.
వ్యక్తిగత దౌర్జన్యాలు ఎదుర్కొని, సమాజం కోసం పోరాడారని ఆయన వంశస్థలు తొలివెలుగుతో ముచ్చటించారు. తొలివెలుగుతో పండుగ సాయన్న మనుమలు చెప్పిన దాని ప్రకారం… మైసమ్మ అడవిలో స్థావరం ఏర్పాటు చేసుకొని, కొంతమంది యువకులతో కలిసి ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేశారని, కత్తిసాము-కర్రసాముతో పాటు గుర్రపు స్వారీ నేర్పించి పేదోళ్లకు సాయం చేసేవారని, సాయన్న వస్తున్నారంటే ఆ రోజు పేద ప్రజలందరికీ పండగ కావటంతో…. పండుగ సాయన్నగా ప్రసిద్ధికెక్కారని చెబుతున్నారు. అత్యంత బలమున్నవాడని, పరాక్రముడని… ఆయన జీవిత కథ బయటకు వస్తుందంటే తమకు ఎంతో సంతోషమంటున్నారు.
ప్రస్తుతం పింక్ రీమేక్‌లో బిజీగా ఉన్న పవన్… ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ మూవీ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఆ కథ పండుగ సాయన్నదేనని, చరిత్రకు సంబంధించిన సినిమాలపై క్రిష్‌కు మంచి పట్టు ఉన్నందున పండుగ సాయన్న చరిత్ర అద్భుతంగా చూపించగలరని పవన్ ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు.