యురేనియం వెలికితీతపై రేవంత్‌తో కలిసి పోరాటానికి పవన్‌కల్యాణ్ సిద్ధం అవుతున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఇద్దరు నేతలు వేర్వేరుగా గళం విప్పారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే వేదికగా ఉద్యమించాలని నిర్ణయానికి వచ్చారు.
హైదరాబాద్ : యురేనియంపై జరిపే పోరాటంలో పవన్ కలిసిరావాలి.. అని రెండు రోజుల క్రితం రేవంత్ ట్విట్టర్ ద్వారా కోరడంతో జనసేనాని స్పందించారు. రేవంత్, పవన్ ఫోన్‌లో దీనిపై మాట్లాడుకున్నారు. యురేనియం తవ్వకాలు, వాటి వల్ల జరిగే నష్టాలపై ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకున్నారు. సోమవారం పవన్ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి రావాలని రేవంత్‌ను ఆహ్వానించారు. రేవంత్ కూడా యురేనియంపై వెనక్కి తగ్గేది లేదని పవన్‌కల్యాణ్‌కు చెప్పారు. ఈ తవ్వకాలతో భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతాయని, ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు అందరూ కలిసి ఉమ్మడి వేదికపై పోరాటం చేయాలని ఉభయులూ అనుకున్నారు. రేవంత్ రెడ్డి, పవన్ ఇద్దరు కలిస్తే కచ్చితంగా యురేనియంపై ఇప్పుడు మొదలైన పోరాటం పెద్ద ఉద్యమంగా మారచ్చునని అనుకుంటున్నారు. ఇద్దరూ మాస్ లీడర్స్ కావడంతో ఉమ్మడిగా ఒక పిలుపు ఇస్తే లక్షల మంది అభిమానులు రోడ్డుమీదికి రావడం ఖాయంగా కనిపిస్తుంది. పవన్-రేవంత్ కలిసి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోంది.
ఇలాంటి వాతావరణం కనిపించడంతోనే ముందస్తుగా కేటీఆర్ మరో హీరో విజయ్ దేవరకొండను రంగంలోకి దింపినట్టుగా భావిస్తున్నారు. ఆ వ్యూహం వెనుక కేటీఆర్‌కు రెండు రకాల ఆలోచనలు వున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కో, రేవంత్‌రెడ్డికో క్రెడిట్ వెళ్లడం ఇష్టం లేకపోవడం అందులో ఒక లక్ష్యమైతే, విషజ్వరాలు, యూరియా కొరత, సొంత పార్టీలో రేగిన చిచ్చు, ఇంకా, మరికొన్ని ఇతర సమస్యలతో తీవ్రమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను నిలువరించడానికి ప్రజల్ని డైవర్ట్ చేయడం మరో లక్ష్యం.