పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో జీ స్టూడియో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిమ్మకాయల ప్రసాద్, విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. వినోదయ సీతమ్ రీమేక్ సినిమా పూజా కార్యక్రమానికి పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు వివేక్ కూచిబొట్ల, విశ్వప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు సముద్రఖని తదితరులు హాజరయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్‌లో నిరాడంబరంగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది.
సముద్రఖని దర్శకత్వంలో రూపొందే ఇంకా పేరు పెట్టని సినిమా పూజా కార్యక్రమానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు నిర్మాతలు ఘనంగా స్వాగతం పలికారు. పవన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి సముద్రఖని, వివేక్ కూచిబొట్ల, విశ్వప్రసాద్ ఆహ్వానించారు. అనంతరం లాంఛనంగా తొలి షాట్‌ను చిత్రీకరించారు. వినోదయ సీతమ్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా సముద్రఖని, పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి స్క్రిప్ట్ పేపర్లను చదువుతున్న ఫోటోలు మీడియాలో హైలెట్ అయ్యాయి.
సాయిధరమ్ తేజ్‌ను పవన్ కల్యాణ్ ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్న ఫోటోలు కూడా అభిమానులను ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. వినోదయ సీతమ్ సినిమా విషయానికి వస్తే.. 2021లో జీ5 ఓటీటీలో రిలీజైంది. ఫాంటసీ, కామెడీ, డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహించి నటించారు. తంబి రామయ్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి.
వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సిద్దమైంది. తెలుగు నేటివిటికి, పవన్ కల్యాణ్ స్టార్ స్టామినాకు తగినట్టుగా సినిమా కథలో మార్పులు చేర్పులు చేశారు. సాయిధరమ్ తేజ్‌ను ప్రాజెక్టులోకి తీసుకొని.. మల్టీస్టారర్ సినిమా లుక్‌ను క్రియేట్ చేశారు.