సెప్టెంబర్ 2.. వినాయక చవితి.. ఊరూవాడా అందరికీ ఉత్సాహభరితమైన పండగ. జన సైనికులకు, పవన్‌కల్యాణ్ ఫాన్స్‌కు ఇంకా పెద్ద పండగ. ఎందుకంటే.. ఇదేరోజు తమ అభిమాన హీరో, ఆరాధ్య నేత పవర్‌స్టార్ పుట్టినరోజు కనుక.
తన 48వ పుట్టినరోజున ఈ హీరో ఏదో ఒక అద్భుతమైన కానుక ఇవ్వబోతున్నాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. నాయకుడిగా మారి వెండితెరకు పూర్తిగా దూరమైపోయిన తమ కధానాయకుడు తన పుట్టినరోజు సందర్భంగా మళ్లీ సిన్మాల్లోకి వస్తున్నట్టు ఒక గుడ్‌న్యూస్ అందిస్తారని అందరూ అత్యంత నమ్మకంతో ఉన్నారు.
అభిమానుల ఆశలను గౌరవిస్తూ.. పవన్‌కల్యాణ్ నిజంగానే ఏదైనా సంచలన ప్రకటన చేస్తున్నారా? యస్ అంటూ.. మాంఛి రీసౌండ్ అయితే వినిపిస్తోంది.
పవర్‌స్టార్ ఏం చేసినా డిఫరెంటుగానే చేస్తాడు. ‘నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది’…అంటూ గబ్బర్‌సింగ్ సినిమాలో దర్శకుడు హరీశ్ శంకర్ రాసిన డైలాగుకు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం అతికినట్టుగా సరిపోతుంది. పవన్ తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ఈ విషయం మనకు స్పష్టంగా తెలియచేస్తాయి. అప్పుడు ఎన్నికల సభల్లో, ఈ మధ్య చాలా సందర్భాల్లో తానిక సినిమాలకు దూరమంటూ పవన్‌కల్యాణ్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. కేవలం రాజకీయాలపైనే దృష్టి నిలుపుతానని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. దానికి తగ్గట్టే జన సేనాని పూర్తిగా జనం మధ్యనే తిరుగుతున్నాడు.
కాకపోతే, కొన్ని రోజులుగా అతనిలో ఒక చిన్న మార్పు కనిపిస్తోంది. ఇటీవల తన అన్నయ్య.. మెగాస్టార్‌ని కలిసి మాట్లాడిన సందర్భంలో ఈ సినిమాల ప్రస్తావన వచ్చిందని ఒక సమాచారం. సినిమా కెరియర్ పూర్తిగా పాడుచేసుకుంటున్నావని మెగాస్టార్ ఈ తమ్ముడిని చిన్నగా మందలించినట్టు ఒక కబురొచ్చింది. రాజకీయ రంగంలో కొనసాగవద్దని చెప్పడం లేదని, అప్పుడప్పుడైనా ఒకటీ, రెండు సెలెక్టెడ్ మూవీస్ చేయాలని అన్నయ్య చేసిన సూచనపై తమ్ముడిలో మధనం మొదలైందని అంటున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇటీవల సినిమాలకు సంబంధించిన ఓ పుస్తకావిష్కరణకు అతిథిగా వచ్చినపుడు, అన్నయ్య చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి టీజర్‌కు వాయిస్‌ఓవర్ ఇచ్చినపుడు, రీసెంట్‌గా చిరు పుట్టినరోజు వేడుక సందర్భంలోనూ తాను సినిమాలను, సినీ పరిశ్రమను అంత ఈజీగా వదులుకోలేనన్నట్టుగా పవర్‌స్టార్ కొన్ని సంకేతాలు ఇచ్చారు.
ఇంతకీ పవన్ మళ్ళీ సినిమాలు చేస్తాడా అంటే.. మెగా ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్స్‌లో ఔననే సమాధానమే వినిపిస్తోంది. దీనికి సంబంధించి, అంటే సినిమాల్లో తన రీ-ఎంట్రీ గురించి సెప్టెంబర్ 2న, తన పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా పవన్ ప్రకటించే అవకాశం ఉందని మెగా సర్కిల్స్ నుంచి గట్టిగా వినిపిస్తోంది.
ఒకవేళ పవన్ రెడీ అంటే అతనితో సినిమాలు చేయడానికి ఎందరో దర్శకులు, అడిగినంత రెమ్యూనరేషన్ సమర్పించుకోడానికి భారీ నిర్మాణ సంస్థలు క్యూలో ఉన్నారు. అయితే ఆ అవకాశం ఎవరికొస్తుంది?
వస్తే.. అసలు ఎవరి డైరెక్షన్‌లో పవర్‌స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు?
దీనికి ఒక గట్టి సమాధానమే వినపడుతోంది. పవన్ తరువాత సినిమా దర్శకుడు డాలీతో ఉంటుందన్నదే ఆ స్ట్రాంగ్ ఆన్సర్. ఇప్పటికే పవర్ స్టార్ హీరోగా ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ సినిమాలకు దర్శకత్వం వహించిన డాలీ అలియాస్ కిశోర్ కుమార్ పార్థసాని మరోసారి పవన్ సినిమా కోసం తన స్క్రిప్ట్ వర్క్ మూడుసార్లకు పైగా రివైజ్ చేసి మరీ కసరత్తులు చేశాడని సమాచారం. ఈ సినిమాకు నిర్మాతగా గత ఎన్నికల్లో పవన్ పొలిటికల్ పార్టీ జనసేన కోసం బాగా కష్టించిన రాం తాళ్ళూరి ఉంటాడని భోగట్టా.
ఇక, ఫాన్స్ మరో పేరు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అతడే త్రివిక్రమ్ శ్రీనివాస్. పవర్‌స్టార్‌కు మంచి స్నేహితుడే కాకుండా జనసేన సభల కోసం స్పీచుల్లోనూ చెయ్యి వేశాడని త్రివిక్రమ్ గురించి ఫాన్స్ చెప్పుకుంటుంటారు. పవన్‌తో తను ఈ పాటికే హారిక హాసినీ క్రియేషన్స్ బేనర్‌పై రాధాకృష్ణ నిర్మాతగా ఓ సినిమాని పట్టాలెక్కించి ఉండాల్సింది. ఐతే,ఎన్నికలు, ఎన్నికల ఫలితాల వల్ల అది కుదరలేదు. సో, ఈ కాంబినేషన్‌లోనే పవన్ నెక్స్ట్ సినిమా ఉండచ్చునని అభిమానుల అంచనా. ఐతే, రీసెంట్‌గా పవన్ – త్రివిక్రమ్ మధ్యలో సంబంధాలు చెడాయని, అందుకే ఆ కాంబినేషన్ వర్కవుట్ కాకపోవచ్చనీ కూడా వినిపిస్తోంది. ఈ అందరితో పాటూ పవన్ కల్యాణ్‌కు గబ్బర్‌సింగ్ వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్ కూడా లైన్లో ఉన్నాడని మరో కబురు.
మరి వీరిలో ఎవరు పవన్ చెయ్యబోయే సినిమాకు దర్శకత్వం వహిస్తారో చెప్పలేం.
అన్నట్టు ఇప్పటికే పవన్ హీరోగా చెయ్యబోతున్నాడంటూ ఎప్పటినుండో వినిపిస్తూ వస్తోన్న సినిమాలు కూడా ఇప్పుడు మళ్లీ ప్రచారంలోకి వచ్చాయి. అప్పుడెప్పుడో వినిపించిన ఒక పవర్‌ఫుల్ టైటిల్ ‘సత్యాగ్రహి’. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు భాగస్వామ్యంలో వస్తోందని భావించిన ‘సర్దార్’ ఈ లిస్టులో వున్నాయి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతోందని ఊరించిన ‘కోబలి’ కూడా ఈ టైటిళ్ల లిస్టులో ఉంది. వీటిలో సత్యాగ్రహి టైటిల్ వైపు పవర్‌స్టార్ మొగ్గు చూపే అవకాశం వుందనే మాట వినిపిస్తోంది. ‘ఈ సినిమా చేయడం లేదు.. కానీ నిజ జీవితంలో చేస్తాను..’ అంటూ అప్పట్లో సినిమా ఆపేసిన సందర్భంలో పవన్‌కల్యాణ్ అన్నాడు. ఆ మాటలను బట్టే ఆ టైటిల్ అతన్ని ఎంత ఆకర్షించిందో చెప్పచ్చు. తనకెంతో నచ్చిన ఆ సినిమా టైటిల్‌నే పవర్‌స్టార్ రీఎంట్రీగా తీసుకుంటారని ఒక అంచనా.
యంగ్ డైరెక్టర్ ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళంలో ఘన విజయం సాధించిన విజయ్ ‘తేరీ’ సినిమా రీమేక్ పవన్‌కల్యాణ్ చేస్తారని మరో సమాచారం. ఇలా ఈ లిస్టు చూస్తే ఎన్నికల్లో టిక్కెట్ ఆశించేవారి లిస్టులా చాంతాడంత ఉంది, మరి పుట్టినరోజు నాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడో, రీ-ఎంట్రీ ఉంటే ఏ సినిమా ముందు మొదలవుతుందో అందరూ ఎదురుచూస్తున్నారు.