వందల కోట్లు సంపాందించే అవకాశం ఉన్నప్పటికీ వదులుకొని మార్పు కోసం జనసేన అంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. జీరో బేస్డ్ పాలిటిక్స్ ఏపీ లో పనిచేయకపోయినా పట్టు వదలడం లేదు. కానీ రాజకీయాలకు డబ్బే ప్రధానం కావటంతో మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఈ నిర్ణయం పై ఎన్నో విమర్శలు వచ్చాయి. దుకాణం సర్దేశాడు అని కొందరు, విషయం తెలిసి వచ్చిందని కొందరు ఎన్నో విమర్శలు చేశారు. అయినా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. నా కుటుంబాన్ని పోషించుకోవటానికి, పార్టీ కార్యకర్తల కోసం, నన్ను నమ్ముకున్న వారి కోసం సినిమాలు చేస్తున్నా అంటూ ఆనాడు పవన్ ప్రకటించారు.
కానీ తనపై విమర్శలు చేసిన వారికి వేల కోట్ల సంపాదన ఉంది. కొందరికి అధికారం ఉంది. కానీ భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తుంటే…. ఒక్కరూ రూపాయి సహాయానికి ముందుకు రాలేదు. వ్యాపారస్తులు తమ బిజినెస్ పోయింది అంటూ ఇంటికే పరిమితం అయ్యారు. కానీ నాకు సమాజంపై ప్రేమ ఉంది, బాధ్యత ఉంది అని పవన్ గుర్తు చేస్తూ భారీ విరాళం ప్రకటించారు. ఓ సగటు భారతీయుడిగా ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు, తెలంగాణ సీఎం నిధి కి 50లక్షలు, ఆంధ్ర సీఎం నిధి కి 50 లక్షలు ఇచ్చి పవన్ తన ఉదారత చాటుకొని సినీ, రాజకీయ రంగాల వారికి మార్గదర్శి అయ్యాడు.
భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైతున్న సందర్భంలో…. ఇలా అందరూ ముందుకు వస్తే కరోనా వంటి మహమ్మారిపై పోరాటం చేయటంలో ప్రభుత్వాలు మరింత దూకుడుగా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.